Thursday 8 November, 2007

భీష్మపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 6_1_151 నుండి 6_1_180 వరకు

భీష్మపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 6_1_151 నుండి 6_1_180 వరకు

6_1_151 క.

అత్తఱి సురఖచరాదుల,చిత్తము లనిఁ జూచువేడ్కఁ జిడిముడి వడఁగా
నొత్తొరవున నిరుదెఱంగుల,యుత్తమవీరులును దాఁక నుంకింపంగన్.


-: ధర్మరాజు పాదచారియై భీష్మునియొద్దకుఁ బోవుట. :-

6_1_152 తే.

సమరకౌతుకి యైనయజాతశత్రుఁ
డొప్పు మిగిలెడుమైమఱు వూడ్చి యాయు
ధములతోఁ గూడఁ దనయరదమునఁ బెట్టి
యిలకు డిగి మౌని యై కరంబులు మొగిడ్చి.


6_1_153 వ.

భీష్ముదెసకుం జనుచున్నం గనుంగొని యమ్మహీవల్లభుతమ్ములును శౌరిసాత్యకు
లును బరమాప్తు లగుధరణీశులు నతనిచేతోవృత్తం బెఱుంగమి నుత్తలపడు
చిత్తంబులతో వాహనంబులు డిగ్గి యతనిం గూడం జని యప్పుడు.


6_1_154 సీ.

ఏ మెల్ల నుండ నీవి ట్లొంటి గాల్నడ, నేఁగు చున్కికిఁ గత మెద్దియొక్కొ
పన్పినపగఱపై సన్నాహ మంతయు, నెడలించి నడచుట యెట్టులొక్కొ
రిపులు దేఁకువ సెడఁ గృపణత దుర్భలు, చాడ్పునఁ జను టేమిచందమొక్కొ
యడరి పోరాటకు నద నైనచో నొప్పు, పొలివోవఁ బోవుట వోలునొక్కొ


6_1_154 తే.

యని క్రమంబున నామరుత్తనయవిజయ
నకులసహదేవు లడుగ భూనాథుఁ డొక్క
పలుకుఁ బలుకక యరుగంగఁ బద్మనాభుఁ
డక్కుమారులతో నిట్టు లనియె నగుచు.


6_1_155 వ.

ఇతనితలం పే నెఱింగితి నితండు భీష్మద్రోణకృపశల్యులకు నమస్కరించి వారల
చేత ననుఙాతుం డై భండనంబు సేయువాఁడుగాఁ దలంచి చనియెడుఁ బెద్దల
యనుఙ గొని కయ్యంబు సేసిన జయం బగుట నిశ్చయం బని యార్యులు సెప్పు
దురు గావున నాసుకర్మం బాచరించుట మేలకాక యనిన విని యజాతశత్రు
వెనుక నప్పు డరిగినవారలు పలుకు లుడిగి నిలిచి వెఱఁగుపడి చిత్రరూపంబుల
చందం బై చూచు చుండిరి కృష్ణార్జునులును భీముండును గవలును దోన చనం
గౌంతేయాగ్రజుండు గాంగేయు తేరు సేరం బోవం గౌరవసైన్యంబుజనంబు లేవు
మిగిలి మెడ లెత్తి కనుంగొని రయ్యవసరంబున నందలియోధవీరు లితం డింత
వెఱచునే యనువారును వెఱవ నిప్పు డితని కేమి వచ్చె ననువారును వృకోద
రుండు వివ్వచ్చుండు గవలు సౌభద్రుండు సాత్యకి విరాటుండు ద్రుపదుండు
ధృష్టద్యుమ్నుండు శిఖండియుం గలుగఁ దన కింత యేల యనువారును ధర్మతన
యుండు భీతుండు గాఁ డేమితలంపున వచ్చెనో యనువారును మఱియ ననేకప్ర
కారంబులం బలుకువారును నై యుండిరి పాండవసైనికులు మానధనుం డగుని
మ్మానవనాధుండు నదీనందనుతో నేమనువాఁ డతం డితని నేమిభంగిసమ్మానించు
మాధవధనంజయు లెట్లు వలుకువారు మారుతసుతుండును మాద్రీసూనులును
నెత్తెఱంగున మాట లాడుదురువీ రేమిటికివ్విధంబునకుం దొడంగి రనుచు వగచి
వెండియు వివిధవచనముఖరు లగుచుండి రయ్యుధిష్ఠిరుండు సముద్యతనానాయుధ
బహుళం బైనకురువ్యూహంబు దఱిసి పితామహుపాలికిం బోయి తత్పాదంబు
లకుఁ బ్రణామంబు సేసి సవినయంబుగా నతని కి ట్లనియె.


6_1_156 ఆ.

అనఘ నీ కెదిర్చి యని సేయువాఁడనై, మున్ననుజ్ఞ గొనఁగ నిన్ను గాన
నెమ్మి వచ్చినాండ నీచేత దీవెన, వడసి చనిన నేను బగఱ గెలుతు.


6_1_157 సీ.

అన విని గాంగేయుఁ డక్కట నీ విట్లు, సనుదేక తక్కిన శాప మిత్తు
వచ్చితి మే లయ్యే వైరుల నిర్జింపు, మిది గాకయును వర మెద్ది యైన
నడుగుము నీకుఁ గా నని సేయు టొక్కటి, దక్కంగ నావుడు ధర్మసుతుఁడు
రారాజుపక్ష మైరణము సేయుము నాకు, హిత మగుకార్యంబు మతిఁ దలంపు


6_1_157 ఆ.

మనుడు నట్లు కాక యట నీతలం పేమి, యనిభీష్ముతోడ నతఁడు నిన్నుఁ
బోర గెలుచువిధము బోధింపు మనుటయు, సస్మి తాస్యుఁ డగుచు శాంతనవుండు.


6_1_158 క.

నను మార్కొని గెలువఁగ న,య్యనిమిషులకు నరిది యనుడు న ట్లగుటఁగదా
నిను వేఁడెద నని కుంతీ,తనయుఁడు వలుకుటయుఁ దత్పితామహుడు గృపన్.


6_1_159 ఉ.

చుట్టఱికంబునన్ మనసు సొచ్చి ననుం గరఁగించి వేఁడినన్
దిట్టతనంబు వోవిడిచి తీవ్రరణంబుకడంక దక్కి నేఁ
బట్టినయాయుధంబు పెడఁ బాసినఁ గాని వధింపఁ బోల ద
ట్టిట్టన కేఁగు మిప్పురస యింతక కాలము గాదు దానికిన్.


-: ధర్మరాజు గురుకృపశల్యులచేత యుద్ధమున కనుజ్ఞాతుం డగుట :-

6_1_160 తే.

క్రమ్మఱంగ నేతెంచెదు గాక యనుడు, నతిముదంబునఁ బ్రణమిల్లి యతనివాక్య
మపుడుదలనిడుకొనినవాఁడగుచునప్పి,తామహుని నెమ్మి వీడ్కొని ధర్మసుతుఁడు.


6_1_161 వ.

కృష్ణార్జునాదులుం దోడన చనుదేర గురుకృపశల్యులకడకుం గ్రమంబున నరిగి
పాదప్రణామంబు లాచరించి వారలచేత రణంబునకు ననుజ్ఞ వడసి యమ్మనుజపతి
దనకు జయం బాశాసింపు మని యభ్యర్థించిన నయ్యాచార్యుండు నీకుం గృష్ణుం
డుమంత్రి యై యుండ నొరుల జయం బాశాసింపు మన నేల ధర్మం బేవలనం
గలుగు నవ్వలన కృష్ణుండు గైకొను నవ్వలనికి జయం బగు ననియె నిజవధోపా
యంబు వేఁడిన నతండు నాచేత నాయుధం బున్నంతసేపు నన్నుం జంప నెట్టి
వారికి నశక్యం బేను బ్రాయోపవేశంబున సన్న్యస్తశస్త్రుండ నైనం జంపుటకు
నోపునట్టివారికి నది దొరఁకొనుఁ బెద్దయు నమ్మఁ గలవాఁడు సెప్ప నత్యంతదుస్స
హం బైనకీడుమాట వింటినేని నట్టివాఁడ నగుదు నప్పు డట్టిపగఱకు నప్పని దీర్ప
నను వై యుండ నని చెప్పినఁ గృపాచార్యునిం బరిమార్చు తెఱంగు నడుగం
దొడంగి యేర్పడం బలుకనేరకున్న నతం డెఱింగి తాను వధ్యుండుగామి యెఱిం
గించి గెలువు మని దీవించె మద్రపతితో నీవు రాధేయునకు సారధి వగుట సంభ
వింప నోపు నని చెప్పి కయ్యంబునప్పుడు కర్ణుతేజంబు దూలం బలికి యతనిఁ జిక్కు
వఱుపవలయు నని వరంబు గోరిన నతం డవ్విధంబు నీయుద్యోగసమయంబున
నియ్యకొనినయదిగాదే యట్ల చేయుదు నని పలికెనిత్తెఱంగున నందఱ్ వీడ్కొని
యజాతశత్రుం డనుజవర్గానుగతుండై మరలెనయ్యవసరంబున.


6_1_162 క.

మొనలవినోదంబునకుం, గనుఁగొన నేతెంచి యున్న కర్ణునికడకుం
జని హరి యిట్లను నొండొరుఁ, గని యప్పటియుచితభంగి గడతేర్చి తగన్.


6_1_163 తే.

అమరతటినీతనూజుపై యలుకఁజేసి యనికిఁ జొర వటె యట్లైన నతఁడు సచ్చు
నంతదాఁకఁ బాండవులకై కొంత సమర, కేలి వేడుకఁ జలుపుట వోలదొక్కొ.


6_1_164 వ.

అనిన విని దేవకీనందనునకు రాధానందనుం డిట్లనియె.


6_1_165 క.

కినుక వొడమి గంగావు, త్త్రునికయ్యమునప్పు డనికిఁ దొలఁగితి నేనిం
జనుఁ గా కేఁ గురుపతి కి,చ్చినప్రాణం బొండువలనఁ జేర్పందగునే.


6_1_166 వ.

అనవుడు నప్పలుకులకు సంతోషించినవాఁడయి వాసుదేవుండు గౌంతేయులం
గూడఁ జనుదెంచె నవ్విధంబున ధర్మనందనుండు గౌరవసైన్యంబు వెడలి నిలిచి
యద్దిక్కు మొగంబు సేసి యెలుం గెత్తి యిట్లనియె.


6_1_167 తే.

మమ్ము నెమ్మిమైఁ గలయఁ జిత్తమ్ముగలుగు, వార లెవ్వరు గలిగినవచ్చికలయుఁ
డట్టివారిని నా తమ్ములంతవారిఁ,గాఁగాఁ బాటింతు నెంతయు గారవమున.


6_1_168 వ.

అనిన విని నీపుత్త్రుండు యుయుత్సుం డేను వచ్చెద నన్నుం గలపికొను మని
పలికిన దానికిం బాండవాగ్రజుండు ప్రియంబందినపలుకులు వలుకుటయును
నతండు దుర్యోధనాదులదుశ్చేష్టితంబు లుగ్గడించుచుఁ గౌంతేయులగుణంబు
లగ్గించుచు నిజసేనాసమేతంబుగా నిస్సాణాదిరావంబులు సెలంగం జని ధర్మనం
దనుబలంబులం గలసె నది యట్టిద కాక సవతాలిప్రజలు పొంద నేర్తుదే యది
య ట్లుండె నిట్లు దన్నుం గలసిన సంతుష్టాంతరంగుం డగుచు నయ్యధిష్ఠిరుండు
యుయుత్సునకు నత్యుపచారసమాచారంబులం బ్రమోదం బొనరించి.


6_1_169 తే.

రథముమీఁదికిఁ జనుదెంచి పృథులసైన్య
హర్షభాషణధ్వనులుఁ ధూర్యస్వనములు
నెగసి దివిముట్ట మైమఱు విదితలిర్చు
నెలమిఁ గోదండతూణీరములు ధరించె.


6_1_170 వ.

తదవసరంబున నతనితమ్ములుం దక్కటిదొరలును దమతమరథంబు లెక్కి యెప్పటి
నెలవుల నిలిచినం దదీయవ్యూహంబు పూర్వప్రకారసన్నాహం బైయొప్పె నట్టి
యెడ రెండుబలంబులవారును బాండవులు దొల్లి పడినపాట్లు సెప్పికొని వగ
చుచు వారు సంధికై చేసినయత్నంబు వా క్రుచ్చి మెచ్చుచు నప్పుడు గురుజనం
బులయెడఁ బాటించినవినయంబు వర్ణించి యనురాగించు చుండి రని చెప్పిన విని
ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె.


6_1_171 క.

మానుగ ధర్మక్షేత్రం,బైనకురుక్షేత్రమున మహాహవమునకుం
బూని మనబలముఁ బాండవ,సేనయు నిటు వన్ని యేమి సేసెం జెపుమా.


6_1_172 వ.

అనిన విని సంజయుం డతని కిట్లను దుర్యోధనుండు పాండవవ్యూహంబు గనుం
గొని గురునికడకుం బోయి.


6_1_173 తే.

చూడు మాచార్య నీదుశిష్యుండు ద్రుపద
సుతుఁ డమర్చినయది పాండుసుతుల సేన
పెంపు బలువును గలిగి యొప్పినది యందు
భీము నర్జునుఁ బోలినబిరుదమగలు.


6_1_174 వ.

సాత్యకి విరాటుండు ద్రుపదుండు ధృష్టకేతుండు చేకితానుండు గాశిరాజు వురు
జిత్తు కుంతిభోజుండు శైబ్యుండు యుధామన్యుండు నుత్తమౌజుండు నభిమన్యుం
డు ద్రౌపదేయులు వార లందఱుం జూలుమానిసుల యిట్లు గూడి భీమాభిరక్షి
తం బగునబ్బలంబు సాల సమర్థంబునుం బోలె మెఱసె మనసేనానాయకు
లం జెప్పెద నిన్నును భీష్ముని నెన్ననేల కృపాచార్యుం డశ్వత్థామ శల్యుండు
వికర్ణుండు భూరిశ్రవసుండు మఱియుం బెక్కండ్రు రథికులుఁ గలరు నానాస్త్రకో
విదులు వివిధయుద్ధవిశారదులు వీర లిందఱు నాకై ప్రాణంబులు విడిచెద మని యు
న్నవారిట్లు భీష్మపరిపాలితం బయినయీసైన్యంబుపెద్ద యసమర్థంబై తోఁ
చుచున్నయది మీ రెల్లను వలయునెడల నిలిచి భీష్మునకుఁ గావలి గావలయు ననిన
ద్రోణుం డట్ల కాక యింత సెప్ప నేమిటి కనియె నప్పలుకులు విని యమ్మహీపతికిఁ
బ్రియంబు వుట్ట శాంతనవుండు సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన.


6_1_175 క.

తనతనశంఖంబును ద, క్కును గలదొర లెల్ల ననికి గొనకొని పూరిం
చినవివిధతూర్యనాదం, బును జెలఁగె నభంబు దిశలుఁ బూర్ణంబులు గాన్.


6_1_176 వ.

అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రం
బును యుధిష్ఠిరుం డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్ప
కంబులును బాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖదండనా
యకులు దమతమశంఖంబులుఁ బూరించిన.


6_1_177 క.

అనయము నుగ్రం బగుత, ద్ధ్వని గాంధారేయహృదయదారణ మై పాం
డునరేంద్రపుత్త్రసైనిక, మనోహరం బగుచుఁ జెలఁగె మనుజాధీశా.


6_1_178 వ.

తదనంతరంబ శస్త్రసంపాతనంబునకు సమయం బగుటయుఁ గపిధ్వజుండు గాం
డీవంబు వుచ్చికొని గుణంబు సారించి బాణపాణియై నీకొడుకులం జూచి కృష్ణుని
తో నిట్లనియె.


6_1_179 తే.

కౌరవులలోన నిప్పు డెవ్వారితోడ
ననికిఁ గడఁగుదునో చూచికొనంగ వలయు
నరద మల్లన యుభయసైన్యములనడిమి
నేల కటు వోవఁగా నిచ్చి నిలుపు మచట.


-: అర్జునుఁడు స్వజనసంహారంబునకు శంకించి మోహానిష్టుం డగుట :-

6_1_180 వ.

అనినగుడాకేశుపలుకులకు హృషీకేశుండు భీష్మద్రోణప్రముఖయోధవీరులు
గనుంగొనుచుండ నత్తెఱంగున రథోత్తమంబు నిలిపి యతనితో నీ వీకూడిన కౌర
వులం జూడు మనవుడు నప్పార్థుండు రెండుబలంబులయందు నున్నసోదరసుత
మాతులాచార్యాదు లగుబంధుశిష్టజనంబుల నాలోకించి పరమకృపావేశంబున
నత్యంతవిషాదంబు నొంది గోవిందుమొగంబు గనుంగొని దుర్మదాంధుం డయిన
దుర్యోధనుదుర్వినయంబున నింత వుట్టెం జూచితే యని పలికి వెండియు.

--
చందు(తెలుగు కుర్రోడు)
http://telugukurrodu।blogspot।com/

No comments:

Post a Comment