Thursday 29 November, 2007

భీష్మపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 6_1_271 నుండి 6_1_300 వరకు

భీష్మపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 6_1_271 నుండి 6_1_300 వరకు

6_1_271 వ.

ఇట్లు ప్రళయకాలతాండవంబునం బ్రచండమూర్తి యగునష్టమూర్తియుంబోలె
విజృంభించినభీష్ముమార్కొనునుగలు లేకపాండవసైన్యంబుబెండువడి యున్నయె
డ నభిమన్యుండు గనకవర్ణతురంగంబులుం గర్ణికారధ్వజంబును మెఱయం దాఁకి.


6_1_271 సీ.

శల్యు నారాచపంచకమున నొప్పించి, యొకకోలఁ గృతవర్మయురము నొంచి
క్రూరభల్లమున దుర్ముఖుసూతుతల ద్రుంచి, తఱిమి వివింశతిధనువుఁ దునిమి
వెడఁదయమ్మున నేసి వెండియు మూఁడువా,లికయమ్ము లొడలఁ గీలించి కృపుని
హయముల శరచతుష్టయతాడనమున ను,బ్బడఁగించి భీష్ముపై నడరి మేన


6_1_272 తే.

విశిఖనవకంబు నాటించి వెగడుపఱిచి, పేర్చి యార్చిన సురకోటి పిచ్చలించె
మెచ్చి భీష్మాదు లెల్ల విన్వచ్చుఁ బోలు, నెక్కుడగుఁగాని యసదు గాఁడీతఁడనిరి.


6_1_273 చ.

అమరతరంగిణితనయుఁ డర్జుననందనుసూతుఁ గేతుదం
డము నిరుమూఁడుదూపులఁ బడం గడు బెట్టిద మేసి యుజ్జ్వలా
స్త్రము లడరింపఁ గూడికొని తక్కటియేవురుఁ బెక్కు లమ్ములొ
క్కమొగి రయంబునం గురియఁ గా గిరివోలెనతం డుదగ్రుఁడై.


6_1_274 క.

వారలశరవర్షంబులు, వారించుచు వేఱవేఱ వాలంపగముల్
వారలపైఁ గురియుచుఁ గురు,వీరునితాలధ్వజంబు విఱుగఁగ నేసెన్.


6_1_275 ఆ.

తాటిసిడము విఱిగి ధరణిపైఁ గూలినఁ, బాండురాజసుతులబలము లెల్ల
నొక్క పెట్ట యార్చె నుక్కఱి కొరవ, సేనజోదుపిండు చిన్నఁబోయె.


6_1_276 తే.

సింహనాదంబుతో భీమసేనుఁ డప్పు, డనుజతనయునిఁ జేకొని యరిబలంబు
దరలఁ దాఁకిన నతనియుత్తాలసింహ,కేతనము గూల్చె సురనదీసూతి యలిగి.


6_1_277 క.

పవనజుఁడు మూఁడుశరముల, దివిజనదీసూను నేసి దృఢగతిఁ గృపుమే
నవియ నొకటఁ గృతవర్ముని, యవయవతతి నెనిమిదింట నార్చుచు నేసెన్.


6_1_278 వ.

మఱియు నమ్మారుతతనయుండు.


6_1_279 శా.

మద్రేశున్ వెగ డొంద నేసె నతనిన్ మన్నించుజోదుల్ ప్రతా
పోద్రేకంబున నొక్కపెట్ట రథవేగోద్దీప్తులై తాఁకినన్
రౌద్రం బాకృతిఁ బొంద సూతహయగాత్రంబుల్ వెసం ద్రుంచి చం
చద్రక్తోదకవీచులం దడిపె నాశ్ఛర్యంబుగా నందఱన్.


6_1_280 వ.

తదనంతరంబ సాత్యకియు ధృష్టద్యుమ్నుండును గేకయపంచకంబును విరా
టుండు నతనికొడుకులం దలకడచి యురవడించిన.


6_1_281 క.

అందఱమేనుల గంగా,నందనుఁడు శరత్రయములు నాటించెను శ
ల్యుం దాఁకె నుత్తరుఁడు గరి, సందోహముతోడ నధికసంరంభమునన్.


6_1_282 క.

నిజఘటకు మిగిలి యుత్తరు,గజ మమ్మద్రేశురథము గదిసి తురంగ
వ్రజముపయి కడరి కడున,క్కజముగ వెస నేలఁ బెట్టి కాలం జమరెన్.


6_1_283 తే.

శల్యుఁ డుగ్రకోపంబున శక్తి యెత్తి,రయము మెఱయ వై రాటియురస్థ్సలంబు
దూఱ వైచిన నంకుశతో మరములు,విడిచి నడుమన చచ్చుచుఁ బుడమిఁ బడియె.


6_1_284 క.

మద్రేశుఁ డంత నిలువక, రౌద్రంబున వాలు వెఱికి రయము మెఱయ న
త్యుద్రేకత డాసి యుఱికి, భద్రకరిం గరముఁ దునిమిపడ వైచె నిలన్.


6_1_285 క.

తనవిక్రమంబు సేనలు, వినుతింపఁగ నిట్లు సేసి వేగమ కృతవ
ర్మునితేరిపైకి లంఘిం,చెను శల్యుఁడు గిరికి దాఁటుసింగముభంగిన్.


6_1_286 చ.

అనుజుఁడు వడ్డ శంఖుఁడు మహాగ్రహవృత్తిఁ గడంగి శల్యుపైఁ
దనరథరాజితోఁ గవియుదారుణదర్పముఁ జూచి దంతి ము
ట్టినఁ బరికాఱమొత్తము వడిం బఱతెంచినమాడ్కి నాపగా
తనయుఁడు లోనుగా రథికదంబము బిట్టడరెన్ సముద్ధతిన్.


6_1_287 తే.

భీష్ము నంపఱ కోర్వక పెల్లగిల్లి, శంఖుతోడిరథావళిజలదపంక్తి
భూరిమారుతహతిఁ దూల పోవునట్లు,వఱచెఁ గని క్రీడియడ్డంబు వఱపెఁదేరు.


6_1_288 క.

కొఱవియుఁ గొఱవియుఁ దాఁకిన,తెఱఁగున నర్జునుఁడు సురనదీనూనుఁడుఁ జూ
పఱు వొగడఁ దాఁకుటయు ని,ద్దఱదిక్కులసైన్యములను దలపడియె వడిన్.


6_1_289 వ.

అంత నపరాహ్ణం బయ్యె నట్టియెడ.


6_1_290 క.

కృతవర్మరథము డిగి యు,ద్ధతుఁడై మద్రపతి ఘనగదామండితహ
స్తత మెఱయఁ గవిసి రథ్య,ప్రతతిన్ ధరం గూల్చె శంఖుబలము దలంకన్.


6_1_291 క.

విరథుఁ డయి మాత్స్యపుత్రుఁడు, గరవాలము గొని రథంబు గ్రక్కున డిగి యా
తురత సురరాజనందను,నరదముమాటునకు నతిరయంబున నరిగెన్.


6_1_292 క.

దిక్కులఁ దనబాణంబులు, పిక్కటిలఁగ నుల్లసిల్లి భీష్ముఁడు నరుతే
రక్కడ డించి ద్రుపదవిభుఁ,డుక్కఱఁ దత్సేనమీఁద నురవడిఁ గవిసెన్.


6_1_293 వ.

ఇట్లు గవిసి.


6_1_294 క.

ఎండినయడవిన్ దరికొని, మండెడుకార్చిచ్చుమాడ్కి మారి మసఁగిన
ట్లొం డొండ నేచి హయవే, దండస్యందనపదాతితతిఁ బొడవడఁచెన్.


6_1_295 క.

కేకయు లేవురబలములు, నాకులతం బొంద మార్గణాసారమునం
జీకాకుపఱిచె భీష్ముఁడ,నేకగతులఁ దనరథంబునేడ్తెఱ మెఱయెన్.


6_1_296 క.

ఉఱక విరాటుబలముపై, గొఱియలపిండునకుఁ గవియుకోల్పులిక్రియ బి
ట్టఱఁ గవిసి నదీసూనుండు, నుఱుమాడెవియచ్చరులు వినుతి సేయంగన్.


6_1_297 తే.

ఇట్లు పాండవసైన్యంబులెల్లఁ గలంగి, యిక్కడక్కడఁ బడుచుండ నక్కజంపుఁ
గడమి కచ్చెరువడి యొక్కకడకు వచ్చి, పాండుసూనులు నివ్వెఱపాటు నొంద.


6_1_298 క.

శాంతనవుఁడు దేజోదు,ర్దాంతుం డై నావెలుంగుధర కెల్లను జా
లింతు నినుఁ డస్తశైలో,పాంతమునకుఁ జనిన నేమి యనిన ట్లుండెన్.


6_1_299 క.

సోమాన్వయప్రదీపకుఁ, డీమెయిఁ దేజోవిశేష మెసకం బెసఁగం
గా మెఱయుట గనుఁగొని సి,గ్గై మఱువడుమాడ్కిఁ గ్రుంకె నర్కుం డంతన్.


6_1_300 తే.

జలరుహంబులు పాండవసైనికులమొ,గంబులట్టుల విన్ననై కాంతి దఱిఁగె
వారిమనముల భీత్యంధకార మడరు,కరణిఁ జీఁకటి యెడ నెడఁ గవియుదెంచె.

జలరుహంబులు పాండవసైనికులమొ,గంబులట్టుల విన్ననై కాంతి దఱిఁగె
వారిమనముల భీత్యంధకార మడరు,కరణిఁ జీఁకటి యెడ నెడఁ గవియుదెంచె.

--
చందు(తెలుగు కుర్రోడు)
http://telugukurrodu।blogspot।com/

No comments:

Post a Comment