Monday 10 December, 2007

భీష్మపర్వం ద్వితీయాశ్వాసంలోని పద్యాలు 6_2_61 నుండి 6_2_99 వరకు

భీష్మపర్వం ద్వితీయాశ్వాసంలోని పద్యాలు 6_2_61 నుండి 6_2_99 వరకు

6_2_61 క.

భీమునిముందటిబల ము,ద్దామతఁ గాళింగసేనఁ దలపడి హేతి
స్తోమావృత్త మై వ్రాలెను, భూమిపయిన్ సగము సగము పొలుపఱి విఱిగెన్.


6_2_62 ఆ.

మదము మిగిలి కేతుమంతుఁడు గౌంతేయు, పైకిఁ గవిసి యతనిబాణశిఖల
మ్రంది పోయెఁ గడఁగి మంటలో నుఱికిన, మిడుతవోలె మెలఁగ మిడుక లేక.


6_2_63 చ.

పవనసుతుం గళింగనరపాలసుతుం డగుశక్రదేవుఁ డు
గ్రవిశిఖనృష్టిఁ దేల్చి తురగంబులఁ గూల్చినఁ గ్రోధదీప్తుఁ డై
యవిహతభంగి భూరిగద నాతఁడు వైచినఁ గూలె వాఁడు వ
జ్రవిహతిఁ గూలుశైల మన సారథికేతుయుతంబుగా నిలన్.


6_2_64 వ.

ఇవ్విధంబున నద్భుతభయావహం బగుపరాక్రమంబునం బేర్చి భీమసేనుండు
ఘటితకాంచనబిందుసందోహసుందరంబును దృఢవిశాలంబును నగుపలకయుం
గల్పాంతకృతాంతజిహ్వాభీలం బగుకరవాలంబును బుచ్చికొని హతహయం బగు
నరదంబు డిగ్గిన.


6_2_65 ఆ.

కొడుకుపాటుఁ జూచి కోపించి కాళింగ,పతి రయమునఁ దేరు వఱపి భీముఁ
బొదివి పిడుగుఁగొదమవోనినారసము బి,ట్టేసె నది యతండు వేసెఁ దునియ.


6_2_66 క.

మదమున శ్రుతాయు వొక్కటఁ, బదునాలుగుతో మరములు వరఁగించిన నే
ర్పొదవఁగఁ బవనజుఁ డన్నిటిఁ, జిదురుపలుగఁ జేసె ఖడ్గచిత్రనిహతులన్.


-: భీమసేనుని చేత భానుమంతుడు సచ్చుట :-

6_2_67 వ.

అప్పు డాకళింగపతియనుజుం డగుభానుమంతుండు దంతినికరంబుతో నగ్రజునకుం
దల మిగిలి పవమానసూనుపైనడరి నిజఘటలకుం దలకడచి యతనిమేన నారా
చంబులు నాటించుచుఁ గదిసి తనయెక్కినయేనుంగు నేపునం బురికొల్పిన.


6_2_68 శా.

కుంతీసూనుఁడు సింహనాదమున దిక్కుల్ పిక్కటిల్లంగ దు
ర్దాంతస్ఫారగతిం గరిం గదిసి రౌద్రస్ఫూర్తి లంఘించి త
ద్దంతంబుల్ వెస నెక్కి త్రొక్కి తునిమెన్ ధారాళరక్తచ్చటా
క్రంతం బై నభ మొప్ప వానిఁ బటుఖడ్గస్ఫారధారాహతిన్.


6_2_69 వ.

ఇట్లు భానుమంతు నంతకుపురికిం బనిచి.


6_2_70 తే.

మలఁగి గజకంధరము ద్రుంచి తొలఁగ నుఱికి
కెంపు దళు కొత్త వానితోఁ గ్రేళ్ళువాఱు
నావృకోదరుపైఁ గవియంగఁ జేయు
వీచె సేనకుఁ గాళింగవిభుఁడు గడఁగి.


6_2_71 వ.

ఇట్లు శ్రుతాయువు సేయ వీచినఁ దచ్చతురంగంబులు వొదివినం బవనతనయుండు
నిజభుజశిఖరంబులు వెఱుగం దాను బాదచారి యగుటయు నొంటి యైన తెఱం
గునుం దలంపనిదర్పంబునం బేర్చి రణక్రీడకుం జొచ్చి కరవాలంబు శుండాల
కుంభస్థలంబులు పగుల వ్రేసిన మెద డంటి మొదుక నైనం గేతుదండంబులు
నఱికి చులుకం జేయుచు రథికసారథిసహితంబుగా నరదంబులు చక్కడంచి
మొక్కలు వోయిన సస్థిసారంబు లగునశ్వశరీరంబులు గోసి పాఱవైచి వాఁడి
సేయుచు నుబ్బున గుఱ్ఱంబుల కుఱికి బడలుపడ నఱిముఱి విసరిన నోర వో
యిన సురియం జెరివి యవలీలం గాలుబలంబులపైఁ బడిచక్కం జేయుచు మఱియు
నానాప్రకారంబు లగుచిత్రవధవిహారంబుల నమ్మోహరంబు విఘటితవిభ్రాంత
పలాయితంబు గావించి యవరాహ్ణంబునం గళింగపతిం గవియునవసరంబున.


6_2_72 తే.

వివిధసన్నాహయుతముగాఁ బవనతనయు
తేరు దగురథ్యములఁ బూంచి తెచ్చి సూతుఁ
డతనిముందట నిలిపిన నతఁడు వాని
నారదంబునఁ గనుఁగొని యరద మెక్కె.


6_2_73 ఉ.

చాపము వేడ్కఁ బుచ్చికొని సజ్యము సేయునెడం గళింగుఁ డ
ష్టాపదదీప్తపుంఖనశాతశరంబులు నాట నేసినం
గోపితుఁ డై కడంగి బరిగోలలపోటుల నుగ్రవారణా
టోపము పేర్చునట్లుగఁ గడున్ వెస డగ్గఱి భీముఁ డుద్ధతిన్.


6_2_74 ఆ.

అయిదునారసముల నాతనిఁ జదికిలఁ, బడఁగ నేసి మూర్ఛపాలు సేసి
యతనిచక్రరక్షు లైనసత్యుని సత్య,దేవుఁ జంపి నభము దివుర నార్చె.


6_2_75 వ.

అట్లు శ్రుతాయువు మూర్ఛిల్లినం దదీయసారథి రథంబు దొలంగం దోలికొని
పోయినఁ గర్ణధారుండు లేనియానపాత్రంబుంబోలెఁ దద్బలంబు దిరుగుడువడియె
నప్పుడు కిమ్మీరవైరి శంఖంబు పూరించిన.


6_2_76 క.

విని గాంగేయుం డడరినఁ, గని ధృష్టద్యుమ్నుఁడును శిఖండియు నరిభం
జనుఁ డగుసాత్యకియు మరు,త్తనయుఁ గడచి యతనిఁ దాఁకి దర్ప మెలర్పన్.


6_2_77 తే.

బెడిదముగ నేయ రథములపిండు మఱియుఁ
గవిసి తోడ్పడ నతఁడు శిఖండి యొకఁడు
దక్క నందఱతనువులఁ బెక్కునిశిత
విశిఖములు నాటి బకరిపు వెగడుపఱిచి.


6_2_78 వ.

అతనియరదంబుగుఱ్ఱంబులం గూల నేసిన నతండు కోపించి.


6_2_79 క.

ఘనశక్తి వైవ నది శాం,తనవుఁడు ముత్తునియ సేయదానం గోపం
బినుమడిగా నుజ్జ్వలగదఁ, గొని యరదము డిగ్గి కవిసె ఘోరాకృతి యై.


6_2_80 క.

తదవసరంబున సాత్యకి, మదమునఁ గౌంతేయుఁ గడచి మంత్రంబున బె
ట్టిదముగఁ బడ వైచినయొ, ప్పిదమున నస్త్రమునఁ గూల్చె భీష్మునిసూతున్.


6_2_81 వ.

ఇట్లు సారథి నడుటయు.


6_2_82 తే.

వాయువేగంబు లైనతద్వాహనములు
భీష్ముతే రెత్తికొని పాఱెఁ బృథివి యద్రువ
నపుడు మనసైనికులు గీచకారి నెదుర
పలికి పాసిన బయ లయ్యె నతనిమునుము.


6_2_83 వ.

అట్టియెడ ధృష్టద్యుమ్నుండు గారవంబున నమ్మారుతిం దనరథం బెక్కించికొని
యె నంతఁ గృష్ణానుజుండు దన తేరు సేరం దెచ్చి యావృకోదరు నుపలక్షించి.


6_2_84 ఆ.

ఒంటిమైఁ గళింగు నురవడిఁ దలపడి, పుత్రసోదరాప్తభూరిసైన్య
హీనుఁ జేసి కౌరవానీకములు సూడ, నుఱక భంగపెట్టి పఱవు టొప్పె.


6_2_85 వ.

అని యగ్గించె నంతఁ గడంగి వచ్చుశల్యకృపాశ్వత్థామలం గని పార్షతుండు దన
యరదంబున నున్నభీమసేనుని సవినయంబుగా డించి నీవు నన్ను వెన్ను దన్ని
చూడు మని పలికి యద్దెసం దేరు వఱపి యశ్వత్థామరథ్యంబులఁ బదిబాణం
బులం బడ నేసిన నతండు శల్యునిరథంబుపైకిం బోయి పాంచాలపతిసూనుమేన
నిశితాస్త్రంబులు నినిచెఁ దక్కటియిరువురు నట్లచేసి రివ్విధంబున నమ్మువ్వుర
చేత నతం డొక్కరుండును బొదువంబడి యుంట దవ్వులం జూచి విజయనంద
నుండు నిజస్యందనంబు దోలికొని వచ్చి కృపాశ్వత్థామలం దొమ్మిదేసియమ్ముల
నొప్పించి మద్రపతియంగమునఁ బంచవింశతివిశిఖంబులు నాటించె వారును
నతనిఁ బండ్రెండు పండ్రెండుశరంబు లేసి రాసమయంబున భవదీయపౌత్రుం
డగులక్ష్మణకుమారుం డయ్యభిమన్యుం దలపడి మర్మభేదు లయిననారాచమ్ముల
నొప్పించిన నతం డక్కుమారుఁ బంచాశత్సాయకంబులం గప్పి తనహస్తలాఘ
వంబు ప్రకటించిన.


6_2_86 తే.

లస్తకంబునకొలఁదికి లక్ష్మణుండు, వెడఁదయమ్మున నభిమన్యువిల్లు దునియ
నేసి యార్చినఁ గౌరవులెల్ల నార్వ, నతఁడు వేఱొకబలువింట నతని నొంచె.


6_2_87 క.

తనయుఁడు నొచ్చిన దుర్యో,ధనుఁ డర్జునతనయుమీఁదఁ దన తే రలుకం
జన నిచ్చుట గనుఁగొని శాం,తనవద్రోణముఖరథికతతి వెసఁ గవిసెన్.


6_2_88 క.

అఱిముఱి నడరినరథికుల, తఱచునకు సుభద్రకొడుకు దలఁకక తా నం
దఱ కన్నిరూపు లై యే,డ్తెఱ నవ్వుచు నేటు లాడె డీరత మెఱయన్.


6_2_89 వ.

తదవసరంబున.


6_2_90 మ.

కని తే రుప్పరవీదిఁ దోలికొని యాకౌరవ్యసైన్యంబు న
జ్జననాథుం దటినీతనూజు గురుఁ జంచద్బాణవర్షంబులన్
మునుఁగం జేయుచు దేవదత్త మెలమిన్ మ్రోయించుచున్ సంగరా
వని యల్లాడ వియచ్చరుల్ వొగడ వివ్వచ్చుండు వచ్చెన్ వడిన్.


6_2_91 వ.

అంతయు గనుంగొని యుధిష్ఠిరుండు గదంగి సేనల కెల్లను జేయు వీచిన నొక్క
పెట్ట యురవడించి కురుసైన్యంబు దలంకం దలపడియె నప్పు డాదిత్యుం గప్పిధ
రణీరేణువులు చీఁకట్లు గవియింపం గరితురగనరగాత్రగళితరుధిరధారాసారం బది
యడంగునట్లు సేసెనంత నర్జునువివిధబాణపాతంబులఁగౌరవానీకంబునం దునియ
లైనశరాసనశరకవాలపరిఘపరశ్వధాదులను బఱియ లయినహరిశిరఃకుంభికుంభ
పదాతికపాలప్రభృతులును దుమురు లైనరధాంగధ్వజచ్చత్త్రచామరప్రముఖం
బులుం గలిగి కయ్యంపునేల కరంబు ఘోరంబయ్యె నట్టియెడఁ దమమీఁదిమాను
సులు వడినం జెడి తిరిగెడుహయగజస్యందనంబులును దురంగమాతంగస్యందనం
బులు రూపఱిన నేపఱి మెలంగునయ్యైయారోహకులును నైయాకులతంబొందిమ
నబలంబు దెరలి మరల వెఱచఱచి కనుకనిం బఱచినం గృష్ణార్జునులు పాంచజన్య
దేవదత్తంబులు పూరించిన మందాకినీనందనుండు గుంభసంభవున కిట్లనియె.


6_2_92 తే.

కృష్ణసారథ్యమున నొప్పుక్రీడి యిపుడు, కౌరవానీకముల నెల్లఁ గసిమసంగి
కృష్ణసారథ్యమున నొప్పుక్రీడి యైన, నెట్లు సేయంగ వలయుఁ దా నట్లు సేసె.


6_2_93 క.

విను మలుక వోడమి మిక్కిలి, కనుదెఱచినత్రిపురవైరికైవడి యీయ
ర్జునునందుఁ దోఁచుచున్నది, మనమొనలున్ వశము గావు మరలుపు మింకన్.


6_2_94 వ.

పోక నిలిచిన బలుమానుసులుం బెద్దయు డస్సి యొహటించినయ ట్లున్నవారు
వారిజమిత్త్రుండు నపరగిరిశిఖరంబునకుం జేరె నేఁటికిఁ గయ్యంబు సాలింత మని
చెప్పి యతం డియ్యకొన నెల్లవారలం దివియ నియమించి నడపించె నప్పుడు
పాండవులు ఫాంచాలమాత్స్యాదిపరివారసహితంబుగా నార్పులు సెలంగి నింగి
ముట్ట మరలి రిట్లు రెండవనాఁటిసంధ్యాసమయంబున రెండు దెఱంగులవారును
దమతమశిబిరంబులకుం జనిరి మఱునాఁడు.


-: భీష్మునితృతీయదివసయుద్థము :-

6_2_95 క.

రేపకడ రభసమున గం,గాపుత్రుఁడు సేనఁ గూర్చి గరుడవ్యూహం
బేపారఁ తీర్చికొని ము,క్కై పొలుపును బలుపు మెఱయునట్లుగ నిలిచెన్.


6_2_96 వ.

దానికి ద్రోణకృతవర్మలు కన్ను లయిరి కృపాశ్వత్థామలు శిరం బయి నిలిచిరి
త్రిగర్తులతోఁ గూడి భూరిశ్రవశ్శల్యభగదత్తులును సౌవీరజయద్రధులును గంఠ
త్వంబు నొందిరి మనుజపతి యనుజులుం దానును వెన్నయ్యె విందానువిందు
లుం గాంభోజుండును శూరసేనుండునుం బుచ్చం బైరి మాగధకళింగాదిగణం
బులు దక్షిణపక్షం బయ్యును గర్ణాటకోసలప్రముఖనికాయంబులు వామపక్షం
బయ్యును బొలిచిరి తక్కునుం గలవారలుఁ గలయం బన్ని రంతం బాండవబలం
బులును భండనంబునకు వెడలె నయ్యవసరంబున నర్జునుండు.


6_2_97 క.

మనమొనఁ గని ధృష్టద్యు,మ్నున కిట్లనుఁ బన్నఁ బంపు మోహర మర్ధేం
దునిచందంబున దుర్యో,ధనుసైన్యముఁ బొదువుననువు దలకొనవలయున్.


6_2_98 వ.

అనిన విని యతం డట్ల చేసినం బాండ్యమగధబలపరివృతుం దై భీమసేనుండు
దక్షిణశృంగంబున నిలిచెఁ దదనంతరంబ విరాటద్రుపదులును మఱియు నీలుం
డును గాశకరూశగణసమేతుం డై ధృష్టకేతుండును నిలిచిరి శిఖండిసహితుం
డగుధృష్టద్యుమ్ను ము న్నిడికొని యుధిష్ఠిరుండు శుండాలమాలికాభీలంబుగా
మధ్యప్రదేశం బలంకరించె నవ్వలన సాత్యకి మొదలుకొని యోలిన కవలును
ద్రౌపదేయులు నభిమన్యుండు ఘటోత్కచుండుఁ గేకయపతులుం బన్నిరి సకల
లోకంబులకు రక్షకుం డైనరాజీవాక్షుం డెవ్వానికి రక్షణం బొనర్చు నట్టిరథిక
శ్రేష్ఠుండు డాపలికొమ్మునం బన్నెఁ దక్కటిదొరలుం గలయ మోహరించి రి ట్లుభ
యసైన్యంబులు సన్నద్ధంబు లయి నడచి నిస్సాణాదులరానంబులు సెలంగ
రౌద్రంబు ధలకొనం దార్కొనియెఁ దత్సమయంబున ధనంజయుండు మనపదా
తులు బడలువడం దనరథంబు వఱపించి శరంబులు నిగిడించి.


6_2_99 క.

అరధములు రథికవరులును, హరిసారథికేతుసహిత మై పొడిపొడిగాఁ
గరులును జోదులు డొల్లఁగఁ, దురగంబులు రావుతులును దుత్తునియలుగాన్.

--
చందు(తెలుగు కుర్రోడు)
http://telugukurrodu।blogspot।com/

No comments:

Post a Comment