Wednesday 12 December, 2007

భీష్మపర్వం ద్వితీయాశ్వాసంలోని పద్యాలు 6_2_191 నుండి 6_2_220 వరకు

భీష్మపర్వం ద్వితీయాశ్వాసంలోని పద్యాలు 6_2_191 నుండి 6_2_220 వరకు

-: శల్యనందనుఁడు ధృష్టద్యుమ్నునితో యుద్ద్ధంబుసేసి చచ్చుట :-

6_2_191 క.

పలకయు వాలును గొని ఱె,క్కలు గల పెనుఁబాముపగిదిఁ గవిసినఁ గౌంతే
యులు సూచి వెఱఁగుపడి రా,బలమును నీబలముఁ బొగడెఁ బటుశౌర్యంబున్.


6_2_192 వ.

ఇట్లు గవిసి.


6_2_193 క.

వెరవున ధృష్టద్యుమ్నుని, శరనికరం బెల్లఁ బలక జడియుచుఁ గిరణ
స్ఫురణాతిభీషణంబై, కరవాలము మెఱయం జిత్రగతులం గవిసెన్.


6_2_194 తే.

కవిసి వ్రేసిన గ్రక్కున గద యమర్చి, యాఁగి వజ్రప్రహారంబు ననుకరింప
ద్రుపదనందనుఁ డడిచినఁ దునియ లయ్యెఁ, బలకరెండవవాటునఁ బగిలెశిరము.


6_2_195 క.

తల వ్రయ్య లైనఁ బ్రాణం,బులును గృపాణంబు విడిచి భువిఁ ద్రెళ్లె నతం
డలు కొంది కురుబలం బా,కులతం బొందంగఁ గొండగూలినభంగిన్.


6_2_196 తే.

ఇత్తెఱంగున నిజపుత్రుఁ డీల్గుటయును
గ్రోధదీప్తుఁ డై శల్యుండు ద్రుపదసూతి
మీఁదఁ గవిసిన నాతఁ డమేయబాణ
పంక్తి వరఁగించె నుజ్జ్వలప్రభలు నిగుడ.


6_2_197 వ.

అనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె.


6_2_198 క.

మానుష మేటికి దైవా,ధీనము సర్వంబు నస్మదీయస్ఫాయ
త్సేనలఁ బాండునృపాలక,సూనులు గెల్చెదరు కంటె సూతతనూజా.


6_2_199 క.

చావును నోవును మనయో,ధావలికిన్ గెలుపు నుబ్బు నావలికిని నీ
చే వినియెదఁ దుది నెట్టులు, శ్రీవిభవము పాండవులకుఁ జేపడున కదే.


6_2_200 వ.

దుర్యోధనుదుర్ణయంబున నేను దుర్వార్తలు వినుచు దుఃఖంబు లనుభవించు
వాఁడ నైతిఁ గౌంతేయుల గెలుచునుపాయం బెద్దియుం గన్నవారముగా మనిన
సంజయుం డది యట్టిద నీసైన్యంబుల సేనాంగంబు లనేకంబులు వొలిసె దొరలు
మడిసెదరు దిరమై విను మని యిట్లనియె నట్లు శల్యుచేత బహుబాణంబులం
బొదువంబడి పార్షతుం డతని నపరిమితనిశితశరంబులం బొదువ నతం డతనివిల్లు
దునిమి వివిధాస్త్రంబుల వెగడుపఱచిన నాధృష్టద్యుమ్నుండు నొచ్చుటయుఁ
జూచి సుభద్రాసూనుండు మద్రపతిం దాఁకె నప్పుడు కురుపతి పురికొల్ప దుర్ము
ఖుండును దుస్సహుండును దుర్మర్షణుండును సత్యవ్రతుండును జిత్రసేనుండును
ఋరుమిత్రుండును వివింశతియును వికర్ణుండును నయ్యభిమన్యు మార్కొనుట
కలికి పాంచాలనందనుపై నడరి యొక్కొక్కండ పెక్కమ్ము లేసిన నాపృషత
పౌత్రుండు చలింపక యొక్కొక్కరునిం బెక్కమ్ము లేసి కరలాఘవంబు నెఱపి
యందఱకుం జాలి సమరంబు సేయు చుండె.


6_2_201 క.

నకులుఁడు సహదేవుఁడు మా,మకు నచ్చెరువాటుఁ బ్రియము మదిఁ దలకొన నం
బకవృష్టి నస్త్ర, ప్రకరంబునఁ బొదివె మద్రపతియును వారిన్.


6_2_202 వ.

వారికి బాసట యై పాంచాలమత్స్యపతులు సైన్యోపేతంబుగాఁ దఱిమిన మన
యందుఁ గలదండిమగలు శల్యునకు సాహాయ్యంబు సేసి రంత దినమణి యంబర
మధ్యం బలంకరించె నట్టియెడ.


6_2_203 తే.

భీమసేనుండు నేఁడు సంగ్రామమునకుఁ, దీఱుదల యగుఁ గా కని తీవ్రకోప
దీప్తుఁడైగద సూచుచుఁ దేరు నీదు,తనయునకు సమ్ముఖంబుగఁ దఱుముటయును.


6_2_204 క.

నీకొడుకు లందఱును వెఱ, నాకులతం బొంది రప్పు డగ్రజుఁడు గజా
నీకఘను మగధు వీరో, ద్రేకంబునఁ బనిచె మారుతిం దలపడఁగాన్.


6_2_205 వ.

పనుచుటయు నతం డురవడించిన.


6_2_206 చ.

గజఘటలం గనుంగొని వికాసము మోమునఁ బల్లవింపఁగా
భుజశిఖరంబునందు గద వూన్చి మదంబునఁ దేరు డిగ్గి వా
యుజుఁడు గడంగి భీషణసముద్ధతిమైఁ దలపడ్డఁ బర్వత
వజ్రముపయిన్ వెసం గవియువాసవుచందము దోఁచె నత్తఱిన్.


6_2_207 క.

నిజసింహనాదమున న,గ్గజములు గుండియలు వగిలి కలగుండువడన్
విజయాగ్రజుఁ డి ట్లేచి ది,విజవర్గము పిచ్చలింప పిస్ఫురితగతిన్.


6_2_208 వ.

విక్రమవిహారంబునకుం జొచ్చె నప్పుడు ద్రౌపదేయులు నభిమన్యుండును గవ
లును ధృష్టద్యుమ్నుండును గరిసముత్కరంబుపై శరనికరంబులు నిగిడించుచు
భీముని నిరుగెలంకులం జేరి కవిసి రందు నకులనందనుం డగుశతానీకుండు
హస్తికులమస్తకంబులు భల్లంబుల డొల్ల నేయుచు నడరె నట్టియెడ.


6_2_209 చ.

మగధమహీశుఁ డేచి యభిమన్యునిపైఁ గరిఁ గొల్ప నుజ్జ్వలం
బగునొకనారసంబు దొడి యాతఁ డుదగ్రత ఫాలకుంభసం
ధిగతము గాఁగ నేయ నది దీనత మ్రొగ్గఁగ నప్పు డక్కజం
బుగ వెస మాగధుం దునిమె భూస్థలి నయ్యిరుపీనుఁగుం బడన్.


6_2_210 క.

ధృష్టద్యుమ్నుఁడు నుజ్జ్వల, దష్టాపదపుంఖమార్గణావళి నయ్యు
త్కృష్టగజఘటలం గలఁచె న,వష్టంభవిజృంభణంబు వైరులు వొగడన్.


6_2_211 ఉ.

కొన్నిటి హస్తముల్ సదియఁ గొన్నిటిఁ గొమ్ములు దుమ్ము దూళిగాఁ
గొన్నిటిఁ గుంభములు వగులఁ గొన్నిటిఁ గాళులు నుగ్గునూచగాఁ
గొన్నిటిఁ బార్శ్వముల్ నలియఁ గొన్నిటి వీపులు పిండుపీఁచుగా
నన్నిటి భీముఁ డుద్భటగదాహతి నేనికవేఁట లాడఁగన్.


6_2_212 క.

అభిమన్యుద్రుపదసుత,ప్రభృతు లతనితోన మెలఁగి బడలువడఁగ న
య్యిభచయము నిశితవిశిఖ,క్షుభితముగాఁ జేసి రేపు సొం పారంగన్.


6_2_213 క.

ద్విరదము లోఱగెడివియు నె,త్తురు గ్రక్కుచుఁ గూలెడివి గదుపులై కలయం
దిరుగుడు వడియెడివియు భువిఁ,బోరలెడివియు నయ్యెఁ బవనపుత్రుమునుమునన్.


6_2_214 క.

ఏనుఁగునెత్తుట గదయుం, దానుఁ దడిసి విలయకాలదండధరునిచం
దానం బావని మాగధ, సేనం బీనుంగుపెంటఁ జేసి చెలంగెన్.


6_2_215 క.

శరములవేగంబున గద, పరుసఁదనంబునను గలఁగఁబడి చేడ్పడ నా
కరులం దోలెను భీముఁడు, వెరవున గోపకుఁడు గదుపు వెలిచినమాడ్కిన్.


6_2_216 క.

పెనుగాలిఁ దూలుమొగిళులొ, యన నిభములు విఱిగి నిజబలావలి సదియం
దనమీఁదఁ బాఱ దుర్యో,ధనుఁ డదలిచి సర్వసైన్యతతిఁ బురికొల్పెన్.


6_2_217 క.

పతి పురికొలిపిన నమవస, నతిశయముగఁ బొంగిజలధి యనఁ గ్రమ్మినయు
ద్ధతబలము నిలిపె నమ్మా,రుతి సెలియలికట్టక్రియ నిరూఢస్థితి యై.


6_2_218 క.

ఇట్లు నిలిపి యార్చి తఱియం జొచ్చువృకోదరునకుం దో డయి ధృష్టద్యుమ్న
సౌభద్రప్రముఖు లగురథికజనంబులు.


6_2_219 క.

విడువక దాపట వలపటఁ, గడిమి మెఱయ నిలిచి యపుడు కౌరవసేనం
గడుఁ జిక్కువఱచి రొక్కు,మ్మడి నమ్ములవానఁ గురిసి మద మెలరారన్.


6_2_220 క.

అడవి దరికొనినపావకు, వడవున భీముండు గౌరవవ్యూహంబుం
బొడి సేయుచుఁ బేర్చెం దన,యొడలు మనము నంత కంత కుబ్బుచు నుండన్.

--
చందు(తెలుగు కుర్రోడు)
http://telugukurrodu।blogspot।com/

No comments:

Post a Comment