Friday 4 July, 2008

ఆంధ్రమహాభారతంలోని శాంతిపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 12_1_31 నుండి 12_1_60 వరకు

ఆంధ్రమహాభారతంలోని శాంతిపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 12_1_31 నుండి 12_1_60 వరకు

12_1_31 శా.

భల్లంబుల్ పరఁగించి యుగ్రముగ భూపాలోత్తమాంగంబులన్
డొల్లం జేయుచుఁ జిత్రలాఘవము నాటోపంబు దర్పంబు రా
జిల్లం గుంభిఘటారథవ్రజహయశ్రేణీపదాతిప్రతా
నోల్లాసంబుల రూపుమాపుచు నవ్వార్యుం డయ్యెఁ గర్ణుం డనిన్.


12_1_32 వ.

ఇవ్విధంబున విక్రమించునవ్వీరవర్యునిశౌర్యబాహువీర్యంబులకు భయంబుఁగొని
హతశేషు లయినభూపతులు పఱచినం బ్రీతుం డగుచు నక్కురుకుమారుండు
గన్యారత్నంబుఁగొని కరినగరంబున కరుగుదెంచె నప్పగ మనంబునఁ బెట్టికొని
పదంపడి జరాసంధుం డక్కమలబంధుపుత్రు నెక్కటిపోరికిం బిలిచినం బోయి.


12_1_33 సీ.

ఎక్కేక్కటిపోరు యిద్ధదివ్యాస్త్రం, చయవంతుఁ డగుజరాసంధుబాణ
ధనురాదివివిధసాధనములు దనచేతఁ, దశయస్త్రశస్త్రసంతాన మెల్ల
నాతనిచే మడియంగ రథంబులు, డిగ్గి పెంపారెడు నగ్గలికల
నాతండుఁ దాను బాహాసంగరమునకుఁ, జొచ్చి పెనంగఁగ నొచ్చి యతని


12_1_33 ఆ.

యంగసంధి వికల మగుటయుఁ బోరు సా, లించి యతఁడు గారవించి తనకు
మహితవిభవ మైనమాలినీనగర మీ, నధికతేజ మెసఁగ నరుగుదెంచె.


12_1_34 వ.

ఈరెం డవదానంబులునీవును గొంత యెఱుంగు దిట్లుప్రసిద్ధబలపరాక్రముండైన
కర్ణునుదీర్ణత్వంబు సెఱుచుటకు నై కవచకుండలంబులు భిక్షించి పుచ్చుకొని
నాకలోకపతి నీకు హితం బాచరించె దానంజేసి ధనుంజయుం డతనిం దెగటార్పం
జాలె నని చెప్పి వెండియు.


12_1_35 చ.

వినుము నరేంద్ర విప్రుం డలివెన్ జమదగ్నిసుతుండు శాప మి
చ్చె నమరభర్త వంచనముసేసె వరం బని కోరి కుంతి మా
న్చె నలుక భీష్ముఁ డర్ధరథుఁ జేసి యడంచెఁ గలంచె మద్రరా
జనుచిత మాడి శౌరి విధి యయ్యె నరుం డనిఁ జంపెం గర్ణునిన్.


12_1_36 వ.

అట్లుం గాక.



12_1_37 క.

హరసురపతియమవరుణులుఁ, గురుకృవులును దివ్యబాణకోటు లొసఁగుటన్
నరుశక్తి కర్ణుతేజ, స్స్ఫురణము నార్పంగఁ జాలెఁ జువ్వె నృపాలా.


12_1_38 వ.

అనిన విని శోకవ్యాకులుం డై యన్నరపతి గన్నీ రొలుక నిట్టూర్పు నిడిగించినం
దత్సమీపంబున నున్న కుంతి గనుంగొని యడ లుడుపుటకై యతనితో
నిట్లనియె.


12_1_39 చ.

జననముఁ దెల్పి యేఁ బిలువ సత్యము సుమ్ముర కుంతిభాషణం
బని తనుజత్వజాతకృప నంబుజమిత్త్రుఁడు వల్కె నేమిటన్
గొనకొన నేరఁ డయ్యె నినుఁ గూడ సుయోధనుఁ బట్టి యట్టిక
ర్ణునకయి నీకు నేటికి మనోవ్యథఁ బొందఁగ నిట్లు పుత్రకా.


12_1_40 వ.

అనుటయు నవ్వచనంబులు దనకు నసహ్యంబు లైనం గటకటంబడి యద్దేవి
నాలోకించి భవదీయమంత్రకార్యగోపనంబునం గాదె యింత పుట్టె నని పలికి
యంత నిలువక.



-: ధర్మరాజు స్త్రీలకు రహస్యరక్షణంబు లేకుండ శపియించుట. :-

12_1_41 తే.

అంగనాజన్మములకు రహస్యరక్ష, ణంబునందలిశక్తి మనంబులందుఁ
గలుగ కుండెడు మెల్లలోకముల ననిశ,పించె నాధర్మదేవతా ప్రియసుతుండు.


12_1_42 వ.

ఇట్లు మహాతేజోధనుం డగునజ్జననాథుం డట్లు శపియించి కుంతి చేసినకర్ణగోప
నంబు ప్రసంగంబు గా సంతరంబు గృతపడినకార్యంబులదెస నిగుడం దనకతం
బున మృతిఁ బొందినయుభయపక్షబంధుమిత్రకోటులం దలంచి యుమ్మలించి విశే
షించి కర్ణుచావునకుఁ దూర వగచి విహ్వలించి వివ్వచ్చునాననం బాలోకించి
యిట్లనియె.


12_1_43 క.

మన కేటిరాజ్య మొండొక, జనపదమున కేఁగి భైక్షచర్యావిధి జీ
వనము నడపికొని యుండుద, మనఘా యట్లయిన సుఖులు మవుదుము సుమ్మీ.


12_1_44 వ.

అని వెండియు.


12_1_45 సీ.

జ్ఞాతుల నందఱఁ జంపితి మది యాత్మ, వధమ కాదే రాజవర్తనంబుఁ
గాల్పు మహింస నిక్కము దాల్మి మత్సర, వర్జన మిది వనవాసజనుల
కాగమవిహితంబు లటె యింత యొప్పునే, వనమున వసియింప వలయు వింటె
యసుఖదం మైనరాజ్యామిషంబునకుఁ గు,క్కులభంగిఁ దమలోనఁ గాటులాడి


12_1_45 తే.

కులము నెల్లను బొలియింపఁగుత్సితంపు, బ్రదుకు వచ్చెనె యనువగపాలువడఁగఁ
బ్రమద మొసఁగదు త్రైలోక్యరాజ్యమైనఁ, గానయేనొల్లమహిమీరకైకొనుండు.


12_1_46 మ.

ధృతరాష్ట్రుండు దనూజుకీడు సమబుద్ధిం జూడ కన్నీ చుఁ డే
గతిఁ జన్నం జన నిచ్చెఁ గాని మగుడం గాఁ దివ్వఁ డయ్యెన్ నిరా
కృతశీలుం డగునాసుయోధనుఁడు సంక్షీణంబు సేసెం గులం
బతనిం జంపఁగఁ గోప మాఱె మది శోకాక్రాంత మయ్యెం దుదిన్.


12_1_47 వ.

ఆదుర్జనుండు గర్జం బెఱుంగక దుర్మానంబు వాటించిన సైరించి తొలంగనైతి
రాజ్యపరిగ్రహపరత్వంబు మచ్చిత్తంబునం గలిమింజేసి కిల్బిషం బత్యంతంబు
నాచరింపవలసెఁ బరిగ్రహదోషంబు పరిగ్రహత్యాగంబునం గాని పోదు పరి
గ్రహత్యాగశీలుండు జన్మమరణదుఃఖంబులం బొరయం డని శ్రుతులు సెప్పెడు
నొకనికి సకలధర్మంబులు ననుష్ఠింప శక్యం బగునే యపరిగ్రహం బొక్కటన
శుద్ధుండ నయ్యెద మీరు భూమిపాలనపరిగ్రహతత్పరత్వంబున వర్ణాశ్రమరక్ష
ణంబు సేయుం డేను గాననంబునకుం జని మునిజనసం కాశంబున సుఖి నై యుం
డెద ననిన విని యింద్రాంశసంజనితత్వకలితతేజోధనుం డగునద్ధనంజయుండు
దన యూష్మలత్వంబున నవ్వాక్యంబులు దుస్సహంబు లైనం బదరి దరస్మితం
బునఁ దద్వికారంబుఁ గప్పి యప్పుడమిఱేని కిట్లనియె.


12_1_48 క.

ఓహో యిట్టివి గలవే, బాహాదర్పమునఁ బరులఁ బరిమార్చి తుదిన్
మాహాత్మ్యం బెడలఁగ భి,క్షాహారత నొందఁ దలఁప నగునె నరేంద్రా.


12_1_49 సీ.

ధర్మపథంబున ధరణి సేకుఱినఁ బా,లింపక సత్త్వంబు పెంపు మాలి
విడుచుట యొప్పునే విను మిట్టు లైనము, న్నేల భూపాలుర నెల్లఁ జంపి
తడలిరాజ్యము దక్కి యడవికిఁ జనిన బే, లందురు గాక మే లండ్రె జనులు
కిల్బిషశంక గల్గిన నశ్వమేధాది, పుణ్యకర్మంబులఁ బోదె వంశ


12_1_49 ఆ.

ధర్మమెడలఁ గృపణకర్మంబుఁ గోరి త,ర్థంబు సువ్వె సకలధర్మకారి
యొడమి లేనివాఁడ నడపీనుఁ గనునహు, షోక్తి వినమె దాని నూఁదవలదె.


12_1_50 క.

సరిగా నెన్నుదు రార్యులు, దరిద్రునిం బతితునిం గృతఘ్నుని జడునిన్
దొరకొను ధర్మముఁ గామముఁ, బరమగతియు నర్థమునన పౌరవముఖ్యా.


12_1_51 క.

కలిమియ చుట్టలఁ జేర్చుఁ, గలిమియ చెలులను ఘటించుఁ గలిమియ శౌర్యో
జ్జ్వలుఁ డనిపించుం గలిమియ, పలువురు సద్బుద్ధి యనఁగఁ బరఁగం జేయున్.



12_1_52 క.

ఏవానిబంధుమిత్త్రులు, జీవధనంబులును డప్పిఁ జెందును గృశునిం
గా వాని నెన్నఁగాఁ దగుఁ, గేవలతనుకార్శ్యయుతుఁడు గృశుఁడె నరేంద్రా.


12_1_53 వ.

కావున నర్థోపార్జంబును బంధుమిత్త్రపరితోషణంబును భూపతులకుం బరమ
పురుషార్థం బదియునుం గాక.


12_1_54 తే.

జ్ఞాతినాశనమునఁ గాదె సకల దేవ, తలు ప్రవర్ధన మొందుట ధనము లడచి
పొడిచియొప్పనివారిచేఁ బుచ్చికొనక,యడఁగియుండంగఁజేరునే యండ్రుబుధులు.


12_1_55 వ.

వేదంబులు నిట్లు సెప్పుఁ బృథివి బలువునం గైకొని పార్థివు లర్థంబు లుపార్జించి
పర్జన్యాదు లగునాదిత్యుల నధ్వరక్రియాజాతంబునం బ్రీతులం జేసి యుత్తమ
లోకంబులు వడయుదు రిత్తెరువు వట్టి దిలీప నృగ నహు షాంబరీషమాంధాతలు
నడచుట వినమె తత్పదవి నీ కొదవి యున్నయదితదీయప్రకారంబున బహుళ
దక్షిణవిధానంబుగాబ్రభూతం బైన యజ్ఞంబు సేయవై తేనిఁ జూవెసకల్బిషుండ
వగుట యశ్వమేధంబు సేసినరాజులెల్ల నవభృథంబునం బరిపూతాత్ము లగుదు
రని పలికిన నయ్యజాతశత్రుండు.


12_1_56 క.

వెడవెడ యప్పలుకులు చెవి, నిడికొండొకసేపు చింత యెసకంబునపా
ల్పడి యూర కుండి చిత్తం, బడలునఁ జిక్కువడ నిట్టు లను నర్జనుతోన్.


12_1_57 క.

సేమవుఁదెరు వొక్కటి గల, దే మెచ్చితి దాని నడుగు మెయ్యది యని సు
త్రామసుత యడుగ కున్నను, నేమి వినుము చెప్పెదను మునీంద్రుల కెక్కన్.


12_1_58 సీ.

సారహీనము లగుసంసారసుఖములు విడిచి యేకాకి నై యడవి కేఁగి
తాపసవాక్యామృతములు వీనులఁగ్రోలి, చెలిమి వేర్పాటను చిరమరలకుఁ
జొరక నిందాస్తుతుల్ సరిగాఁగొనుచుఁ గత్తి,నొకఁడువ్రేసినను వేఱొక్కరుండు
చందనం బలఁదిన డెంద మయ్యిరువుర, యెడ సమంబుగ మూఁగ జడుఁ డనంగ


12_1_58 తే.

మెలఁగి తగువేళఁ బర్ణశాలలకు నరిగి, యెత్తగా భిక్ష యెవ్వార లెట్టులేమి
యిడినఁ గైకొని నాలుగే నెడల మాత్రఁ,గన్నదానఁదృప్తుండ నై యున్న మేలు.


12_1_59 క.

అటు గాక కర్మగతిలం, పటుఁడ నగుదు నేని నల్పఫలభాగితమై
నట యిట దిరుగుచు మోక్షని, కటవృత్తికి బాహిరుండఁ గానె కుమారా.


12_1_60 వ.

కావున నాకు దొరకొన్న విమల విమల ప్రజ్ఞామృతం బనుభవింపక తక్కుదునే యిది
శాశ్వతపదప్రదం బనిన విని యనిలతనయుం డతని కిట్లనియె.


--
చంద్ర శేఖర్ కాండ్రు.

2 comments:

  1. మహాభారతం లోని ఈ ఘట్టాన్నే ప్రత్యేకంగా ఎంచి వ్రాయాలన్పించిందో తెలియజేస్తే సంతోషిస్తాను.

    ReplyDelete
  2. నరసింహ గారు,

    నేను ఆంధ్రమహాభాతరతం ప్రాజెక్టులో భాగంగా పై పద్యాలను యూనికోడీకరించాను. ఇవి వారికి పంపుతూ, ఈ బ్లాగులో వేరే ఏమీ రాయటానికి రాక, ఈ పద్యాలను పోస్ట్ చేస్తున్నాను.

    ReplyDelete