Tuesday 8 July, 2008

ఆంధ్రమహాభారతంలోని శాంతిపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 12_1_61 నుండి 12_1_90 వరకు

ఆంధ్రమహాభారతంలోని శాంతిపర్వం ప్రధమాశ్వాసంలోని పద్యాలు 12_1_61 నుండి 12_1_90 వరకు

12_1_61 క.

శ్రుతివిహితకర్మజాత, స్థితియోగ్యుఁడ వైననీకుఁ జేయఁగ వశమే
యతిలోకజ్ఞానసమ, న్వితయతిజనకృత్య మటు వివేకింపు మెదన్.


12_1_62 చ.

అడలున రాజధర్మములయందు జనించె నసూయ నీకు ని
ప్పుడు మును నిస్పృహుండ వయి పోవఁగఁ గన్నఁ గులంబువారుని
ప్పుడమినృపాలురున్ బ్రతికి పోదురు నెమ్మది నట్టు లైన నే
ముడుగుదు మస్త్రజీవనసముద్ధతిఁ జొత్తుము భైక్షవృత్తికిన్.


12_1_63 క.

వాఁడి యగునలుక లోకము, పొఁడిమి సెడఁ గయ్య మట్లు పొడిచి వనటమై
నేఁ డింక నడవికిం జను,వాఁడాం గా కనినఁ బుడమివారలు నగరే.


12_1_64 సీ.

పనివడి త్రవ్వి కూపమునందు నుదకంబు, పానంబు సేయనివానిభంగి
యున్నతతరు వెక్కి జున్ను నేకుఱఁ గొని, తేనియ యాననివానిభంగి
యాఁకొని యొడఁగూర్చి యన్నంబు తళియకు, వచ్చినఁ గుడువనివానిభంగి
తమకించి యొకభంగిఁ దనవశంబుగఁ జేసి, మానినిఁ గవయనివానిభంగి


12_1_64 ఆ.

గాదె కురువరేణ్య ఘనశక్తిశౌర్యసం, పన్ను లైనపగఱ భండనమున
నోర్చి పూజ్యరాజ్య మొల్లక యడవికి, నేఁగు టీవ యెఱుఁగు దిత్తెఱంగు.


12_1_65 క.

నీ వడవి కరుగ నొడఁబడి, నీవెనుకన వచ్చునపుడు నిందింతురు మ
మ్మీవెఱ్ఱు లితని మాన్పం, గా వలఁతులు గార యని జగజ్జను లధిపా.


12_1_66 క.

భోగములఁ బాపి నిందా, భాగులఁగాఁ జేసి యడవిపా ల్వఱిచెదవే
నీగారవంపుఁదమ్ముల, సాగరవృతధరణిఁ గలుగు జనములు వగవన్.


12_1_67 వ.

అని వెండియు.


12_1_68 క.

కేవలనిష్కర్మత మో,క్షావహ మగునేని గిరులు నవనీజములున్
భూవర ముక్తిం బడయం,గా వలవదె యడవి నునికి కైవల్యదమే.


12_1_69 క.

ఫలములయెడ బ్రహ్మార్పణ, కలనపరుం డగుచుఁ గార్యకర్మము నడపన్
వలయుం దత్త్వజ్ఞానము, దలకొనినం గర్మశమము దానై కలుగున్.


12_1_70 వ.

కావునం గర్మహీనత్వం బపవర్గకరంబు గా దనవుడు నర్జునుండు ధర్మనందను
నుద్దేశించి దేవా యొక్కయితిహాసంబు గల దపధరింపు మని యిట్లనియె.


12_1_71 సీ.

కొందఱు బ్రాహ్మణుల్ గొండుక లాత్మకు,లోచితాచారంబు లుడిగి కాన
లకుఁ జన్న వజ్రి వారికిఁ గృప చేసి ప,తత్త్రిరూపమునఁ దత్పార్శ్వమునకు
నరిగి మీకైకొన్నతెరు వొప్ప దనవుడు, విని వా రఖిలమార్గవేది యద్భు
తాస్పద మీపక్షి యని దాని కభిముఖు, లై సత్పథం బెద్ది యనఘ చెపుమ


12_1_71 తే.

యనిన నలుగాలివాన గోవును నశేష, శబ్దములమంత్రమును లోహజాతిఁగాంచ
నమును మనుజుల విప్రుండు సమధికత్వ,భాజనము లండ్రు వేదప్రపంచవిదులు.


12_1_72 వ.

ఇ ట్లుత్తముం డైనపిప్రుం డుత్తమమంత్రోపాశ్రితంబు లగువిహితకర్మంబులు
నడపుట రత్నకాంచనసాంగత్యంబునుంబోలె సంస్తుత్యం బైయుండ నాలస్యం
బునఁగ్రోధంబున శోకంబునఁ దదనుష్ఠానంబు విడుచుట పాతకం బజ్ఞాను లగునర్థ
హీనులు సన్న్యాసకాలవివేకంబు లేక వేగిరపడి యుభయభ్రష్టు లగుదురు గృహ
స్థధర్మంబున వర్తించి యతిథి దేవ పితృసంతృప్తి సేయుచు శిష్టాన్నభోజనపరు
లగుపుణ్యులకుం బుణ్యలోకంబు లఱచేతిలోనివి గావె బ్రహ్మార్పితం బయిన
సత్కర్మకలాపంబు మహానందంబుఁ జేయు ననుటయు.


12_1_73 క.

విని వారు దెలిసి మరలం, జనిరి గృహస్థత్వధర్మసదనుష్ఠానం
బునకు నటు లగుట నేలుము, జనవల్లభ పుడమి నడవుజన్నము లెలమిన్.


12_1_74 వ.

అని చెప్పె నప్పుడు నకులుం డన్నరనాథున కిట్లనియె.


-: నకులుఁడు ధర్మజునకు మనస్తాపోపశమంబు సేయుట. :-

12_1_75 సీ.

దేవతల్ వేదవిధిప్రవర్తకులు బ్రా,హ్మణులును వారలయట్ల శ్రుతుల
కింకరు లై కాదెకిల్బిషంబులఁ బాసి, వారిచందమున శాశ్వతవిభూతి
నొందుట యజ్ఞాదు లుడుగుట సంపరి,త్యాగమే పాడిమై నర్థముల ను
పార్జించి దేవతాబ్రాహ్మణపూజగా, నిడుచుఁ దత్ఫలకోటి విడుపు గాక


12_1_75 ఆ.

క్రోధశోకహర్షకోటుల గృహముతో, విడిచి యోగ మూఁది వృక్షమూల
వాసనిరతి నుండు వాఁ డొకసంపరి, త్యాగినృవుల కది సమర్హ మగునె.


12_1_76 క.

తక్కినమూఁడాశ్రమములు, నొక్కదెస గృహస్థధర్మ మొకదెసఁ దులయం
దెక్కింప వానితోన, య్యొక్కటి సరిదూఁగె నందు రుర్వీశ బుధుల్.


12_1_77 వ.

కావున గృహస్థధర్మంబ యాచరణీయం బట్లుం గాక.


12_1_78 క.

జతనంబున నర్థము సం,చితముగఁ గావించి క్రతువిశేషంబుల దే
వతలం దృప్తులఁ జేయమి, యతికిల్బిషకారి యందు రాగమవేదుల్.


12_1_79 చ.

వినుము తమోమయం బయినవిశ్వముఁ దా వెలిఁగించు నీశ్వరుం
డన నొకరుండు వర్ణతతి నాశ్రమకోటిని వాఁడు గాదె చే
సె నిఖిలకర్మయోగసవిశేషత గల్గుటయుం దదీయక
ల్పనమ తదాజ్ఞకుం దొలఁగఁ బాడియె శోకము గారణంబుగన్.


12_1_80 వ.

హింస దోషంబు గలుగు ననుశంకకుం బని లే దవధరింపుము.


12_1_81 క.

పరుల వధింపక యెవ్వఁడు, ధర యేలెం జెపుమ పూర్వధరణీశులలోఁ
బొరయరు పాపము సుగతిక, యరిగిరి వా రీవు నట్లు యగు టొప్పు నృపా.


12_1_82 క.

రక్ష ప్రజగోరు నిజయో,గక్షేమార్థముగ జనసుఖస్థితి నడపన్
దక్షుఁ డగురాజు నడప కు,పేక్షించినఁ బాప మొంద దే కురుముఖ్యా.


12_1_83 తే.

గోవులను ఘోటకంబులఁ గుంజరముల
దాసులను బ్రీతి ని మ్మెల్ల ధాన్యములను
గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క
నొసఁగు తత్తత్సుపాత్రత్వయుక్తవిధుల.


12_1_84 వ.

వీని నిన్నింటి రిత్త వో విడిచి పోయెద ననుట నీయట్టిమహానుభావునకుం
దగునే యని పలికినం దదనంతరంబ సహదేవుం డమ్మహీపతి కిట్లనియె.


12_1_85 సీ.

వెలివెలి వస్తువుల్ విదిచెఁ బో నరుఁడు గ,ర్మిష్ఠతం గాదె శరీరయాత్ర
నడవువాఁ డది మోక్షణంబు గా నేరదు, శారీరసౌఖ్యసంసక్తి వదలి
బాహ్యపదార్థముల్ పాటించి నిజవంశ, ధర్మముల్ వదలక తగఁ జరింవు
మమత బంధంబు నిర్మమత మోక్షంబును, జేయు నింతయెఱింగి చేసి రధిప


12_1_85 తే.

రాజ్య మెలమి మన్వాదు లరణ్యమునకు, నరిగినీవందువలయుద్రవ్యములమీఁదఁ
జేయవలదె మమత్వంబు వేయు నేల, యదియు సంసారచక్రవాహకముగాదె.


12_1_86 తే.

నీవ చుట్టంబుఁ బక్కంబు నీవ చెలియు, నీవతల్లియుఁ దండ్రియు నీవ గురువు
నీవ దైవంబుఁ గావున నావిషాద,భాషణంబులు సైరింపు భరతముఖ్య.


12_1_87 క.

తథ్యము లైనను దలఁప న,తథ్యము లైనను సభక్తితాత్పర్యమువై
తథ్యంబుఁ బొరయకుండఁగఁ, బథ్యంబుగఁ గొనుము నాదుపలుకులు కరుణన్.


12_1_88 వ.

అనియె నిట్లు దమ్ము లందఱును బోధించుపలుకులు విని ధర్మనందనుం డూరక
యుండె నతనియెడ సవిశేషబహుమానయు నతనిచేత సంతతోపలాలితయు
ధర్మాధర్మనిదర్శనశీలయు నగుపాంచాలి భద్రగజప్రతిమాను లైనయప్పవమాన
తనయధనంజయనకులసహ దేవులమధ్యంబునయూథపతివోలెనున్నయన్నరేంద్రు
నల్లన చేరి యేనును నాయెఱింగినంత సెప్పెద నని యనుజ్ఞఁ గొని యవ్విభు
వదనంబున నిజవిశాలలోచనరోచులు పరఁగ వినయం బాననంబున నతిశయిల్ల.


-: ద్రౌపది ధర్మజునకు హితవచనంబుల మనస్తాపోపశమంబు సేయుట. :-

12_1_89 సీ.

శోకాగ్ని దనికిన సొగయునీతమ్ముల, నుపపన్నవాక్యామృతోపయుక్తిఁ
దేర్పుము గానలం ద్రిమ్మరునాఁడు వీ,రాయాసములఁ బడు టవధరించి
సమయకాలము సన్నఁజనిసుయోధనుఁజంపి,భోగంబులను బహుత్యాగములను
యాగంబులను సద్విహారముల్ సలుపుద, మని యూఱడింపవే యరిగణంబుఁ


12_1_89 తే.

ద్రుంచిరాజ్యంబు సేకొంటితొఱఁగిపోదుఁ,గాకయని యిప్పుడుడికింపనీకుఁ దగునె
ధర్మమును సత్యమును నుచితంబునిన్నుఁ,గడవ నెఱిఁగెడువారలు గలరెయధిప.


12_1_90 వ.

అని ముట్ట నాడి మఱియును.


--
చంద్ర శేఖర్ కాండ్రు.

2 comments:

  1. మీ టపా చాలా బాగుంది.కాని కలర్ కాంబినేషను చగవటానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది.మీ పాత టపాలు కనిపించటం లే దెందువల్ల.మహా భారతంలోని శాంతి పర్వాన్ని బ్లాగుల్లో ఉంచాలనే కోరికతో ఉన్న తెలుగు కుర్రాళ్ళుండటం చూచి చాలా చాలా ఆనందంగా-ఇంకా చెప్పాలంటే కడుపు నిండినట్లుగా అనిపిస్తోంది.మధ్యలో విడవకుండా సాగిపొండి.మీకు నా జేజేలు.

    ReplyDelete
  2. నా దగ్గరనున్న శాంతి పర్వం ప్రతితో పోలిస్తే కొన్నిచోట్ల అక్షర దోషాలు కనిపించాయి.మరికొంచెం జాగ్రత్త వహించగలరు.

    ReplyDelete